హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
పట్నా హైకోర్టు విచారణ తీరుపై అసంతృప్తి
ఢిల్లీ న్యాయమూర్తులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలని, అయితే కళ్లు మూసుకుని మౌన ప్రేక్షకునిగా ఉంటూ ఓ రోబో మాదిరిగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఓ కేసులో బిహార్‌కు చెందిన నిందితుడికి పట్నా హైకోర్టు, దిగువ న్యాయస్థానం మరణశిక్ష విధించిన తీరును తప్పుపట్టింది. దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని ప్రస్తావిస్తూ.. మరణదండన ఉత్తర్వులను రద్దుచేసింది. శిక్షను పునఃపరిశీలించాలంటూ కేసును తిరిగి పట్నా హైకోర్టుకే పంపించింది. బిహార్‌లోని భాగల్పుర్ జిల్లాలో 2015 జూన్ 1న టీవీ చూసేందుకు ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన 11 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆమెను హతమార్చాడనేది అభియోగం. ఈ అభియోగం అత్యంత అరుదైనదని, మరణశిక్షే సరైనదని విచారణ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దానిని హైకోర్టు సమర్థించింది. నిందితుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రల ధర్మాసనం మంగళవారం విచారించింది.ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదిక తీసుకోకపోవడం సహా అనేక లోపాలు ఈ కేసు విచారణలో ఉన్నాయి. తీవ్రమైన విషయాల్లోనూ దర్యాప్తు అధికారులపరంగా ఇలాంటి లోపాలు ఉండడం బాధాకరం. అప్పీలుదారుడిని వైద్య నిపుణుడితో పరీక్ష చేయించలేదు. బాధితురాలి ఇంటికి నిందితుడు వచ్చి, టీవీ చూసేందుకు తన ఇంటికి రావాలని చెప్పడం ఆధారంగా హైకోర్టు ఒక నిర్ణయానికి రావడం దిగ్భ్రాంతికరం. మరో కిశోరప్రాయుడు ఆరోజు నిందితురాలి ఇంటికి వచ్చి ఆమెను తనతోపాటు తీసుకువెళ్లాడని ఇతర సాక్షులంతా పోలీసుల ఎదుట చెప్పారు. ఈ పాయింట్ మీద దిగువ కోర్టులేవీ దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. దీనిపై తగిన ప్రశ్నలు సంధించడం న్యాయమూర్తుల విధి. వారు అత్యంత నిష్పాక్షికంగా వ్యవహరించడంతో పాటు- ఏదో ఒక పక్షంపై వ్యక్తిగత అభిప్రాయాలతో తీర్పు చెప్పారన్న ముద్రకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఆయా పక్షాలు చెప్పే సమాచారం ఆధారంగా రోబోల మాదిరిగానో, రికార్డింగ్ యంత్రాల్లానో వ్యవహరించకూడదు. అమాయకులెవరికీ శిక్ష పడకూడదు. దోషులెవరూ తప్పించుకోకూడదు’ అని సూచించారు.







